శంకర్ సినిమా కేవలం 4నెలల్లో.. సాధ్యమా ?

దర్శకుడు శంకర్ సినిమా పూర్తి కావాలంటే యేళ్లు గడవాలి. క్వాలిటీ విషయంలో రాజీపడని శంకర్ సినిమా ఎప్పుడు పూర్తవుతుందన్నది కచ్చితంగా చెప్పలేం. ఇందుకు ‘2.ఓ’ సినిమాయే ఉదాహరణ. ఈ సినిమా షూటింగ్ పూర్తయినా.. విజువల్ ఎఫెక్ట్ విషయంలో ఏమాత్రం రాజీపడని శంకర్.. యేడాదికి పైగా వాయిదా వేస్తూ వచ్చారు. అలాంటిది ‘భారతీయుడు2’ సినిమా శంకర్ కేవలం నాలుగు నెలల్లో పూర్తి చేయబోతున్నట్టు చెప్పుకొంటున్నారు.

శంకర్ – కమల్ హాసన్ కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘భారతీయుడు’ సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2ని తీసుకొస్తున్నారు. ఇందులో కమల్ సరసన కాజల్ జతకట్టనుంది. ఈ నెల 18 నుంచి పొలాచ్చిలో రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. క‌మ‌ల్ రాజకీయాల్లో ఉన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలో ఆయన పార్టీ బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో భారతీయుడు2 సినిమాని శంకర్ కేవలం 4 నెలల్లో పూర్తి చేసేందుకు ప్రణాఌకలు చేసుకొన్నట్టు ప్రచారం జరుగుతోంది.

2.ఓ సినిమా ప్రమోషన్స్ లో శంకర్ స్పందిస్తూ.. భారతీయుడు 2 సినిమా తీయడం 2.ఓ కంటే కష్టమైనది అని చెప్పుకొచ్చారు. అలాంటిది సినిమాని కేవలం నాలుగు నెలల్లో పూర్తి చేయబోతున్నాడు అన్నది అసత్య ప్రచారమని చెప్పవచ్చు. కాకపోతే.. ఎన్నికల్ సమయంలో కమల్ కి బ్రేక్ ఇచ్చి.. ఇతర తారాగణంపై షూటింగ్ కానిచ్చేయొచ్చేమో.. !