‘ మహర్షి ‘ లో మహేష్ కొడుకు నటిస్తున్నాడా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మహర్షి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా , అల్లరి నరేష్ ఓ ముఖ్య పాత్ర లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ మూవీ మే 09 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఈ చిత్రంలో మహేష్ కొడుకు గౌతమ్ కనిపించబోతున్నాడనే వార్త అభిమానుల్లో ఉత్సహం నింపుతుంది.

ఇప్పటికే గౌతమ్ సుకుమార్ – మహేష్ బాబు కాంబోలో వచ్చిన ‘1 నేనొక్కడినే’ చిత్రంలో మహేష్ బాబు పాత్రలో బాల నటుడుగా నటించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ప్రిన్స్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ‘మహర్షి’ చిత్రంలో గౌతమ్ ఓ ముఖ్యపాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా.. మహర్షి షూటింగ్ లొకేషన్‌లో గౌతమ్ తన తల్లి నమ్రతా శిరోద్కర్‌లో కలిసి కనిపించడం.. పక్కనే దర్శకుడు వంశీ పైడిపల్లి షూట్ చేసిన రష్ కట్‌ని గౌతమ్, నమ్రతలకు చూపిస్తున్నట్టుగా ఉన్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. దీంతో మహేష్, గౌతమ్‌లు ‘మహర్షి’ చిత్రంలో సందడి చేయబోతున్నారనే వార్త ఊపందుకుంది. మరి నిజంగా గౌతమ్ ఈ సినిమాలో నటించాడా..లేదా అనేది తెలియాల్సి ఉంది.

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమాస్ బ్యానర్లపై దిల్ రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వి.పొట్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.