‘భారతీయుడు 2’ తెరకెక్కడం కష్టమేనా..?

శంకర్ – కమల్ హాసన్ కలయికలో ‘భారతీయుడు ‘ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘భారతీయుడు 2’. కొన్ని రోజుల క్రితం ఈ చిత్ర ఓపెనింగ్ ను అట్టహాసంగా చేసారు. లైకా ప్రొడక్షన్స్ వారు ఏ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. షూటింగ్ కూడా మొదలు పెట్టారు. కానీ ఆలా మొదలు పెట్టిన పది రోజుల్లోనే సినిమా ఆగిపోయిందనే వార్తలు బయటకొచ్చాయి. ఓవర్‌ బడ్జెట్‌ అవుతోందనే కారణంతో షూటింగ్‌ నిలిపి వేయాలని లైకా ప్రొడక్షన్స్‌ నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే అందులో నిజం లేదని..షూటింగ్‌ యధావిధిగా జరుగుతోందని చిత్ర యూనిట్ ప్రకటించి ఆ వార్తలకు చెక్ పెట్టారు.

కానీ ఈ సినిమా సజావుగా సాగడం లేదని , సినిమా ముందుకు వెళ్లడం కష్టమని తాజాగా కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి మొదటి షెడ్యూల్‌ ఎస్టిమేట్‌ రెండున్నర కోట్లు కాగా, ఆరు కోట్లు ఖర్చయిందట. పైగా ఈ షెడ్యూల్‌లో అనుకున్నది మొత్తం కూడా తీయలేకపోయారట. కమల్‌ మేకప్‌కే ఎక్కువ సమయం అవసరం అవుతోందని, అంచేత షూటింగ్‌ సజావుగా జరగడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే కమల్‌ ఎక్కువ శ్రమ పడాల్సి రావడంతో ఆయన తనకి చెప్పిన పారితోషికం కంటే ఎక్కువ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారట. మొదటి షెడ్యూల్‌కే ఇంత ఓవర్‌ బడ్జెట్‌ అయి, టైమ్‌కి కంప్లీట్‌ కాకపోతే ఇక ఈ చిత్రాన్ని పూర్తి చేసే సరికి ఎంత అవుతుందో అని భయపడుతున్న లైకా ప్రొడక్షన్ సినిమాను ఇప్పుడే ఆపివేస్తే బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.