సైరా’లో బన్నీ రోల్.. ఇదే !


సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘సైరా’. తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కన్నడ నటుడు కిచ్చా సుదీప్, తమిళ నటుడు విజయ్ సేతుపతితో పాటు జగపతిబాబు, నయనతార, తమన్నా తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాలో ఓ చిన్న పాత్రలైనా నటించేందుకు మెగా హీరోలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ కి ఓ పాత్ర ఖరారైంది. మెగా హీరోయిన్ నిహారికకి ఓ చిన్ని పాత్ర దక్కింది. ఆమె సైరాలో ఓ సందర్భంలో నరసింహారెడ్డిని కాపాడే పాత్రలో కనిపించనుంది. చరణ్ తో పాటు మరో మెగా హీరోకు సైరాలో అవకాశం దక్కింది. ఆ అవకాశం అల్లు అర్జున్ ని వరించదనే ప్రచారం జరిగింది.

ఇప్పుడు సైరాలో బన్నీ పాత్రపై మరింత క్లారిటీ వచ్చింది. ఆయన సినిమాలో నటించలేదట. కేవలం సినిమాకు మాట సాయం మాత్రమే చేస్తున్నారంట. సినిమాలోని కొన్ని సన్నివేశాలకు అల్లు అర్జున్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారని సమాచారం. అలాగే, సినిమాలోని ప్రతి పాత్రను అల్లు అర్జునే తన గొంతుతో పరిచయం చేస్తారట. ఇందులో నిజమెంత ? అనేది తెలియాల్సి ఉంది.