గోపి సుందర్ ఫై చర్యలు..

మ్యూజిక్ డైరెక్టర్ గోపిసుందర్ చిక్కుల్లో పడబోతున్నాడా..? ఇక తెలుగులో ఆయనకు అవకాశాలు ఇచ్చేందుకు నిర్మాతలు వెనుకడుగు వేస్తారా..? అసలు తెలుగు చాన్సులే రావా..? ఇప్పుడు ఇవే ఫిలిం సర్కిల్లో వినిపిస్తున్న మాటలు. మళ్లీ మళ్లీ రాని రోజు చిత్రంతో తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన గోపి…అతి తక్కువ సమయంలోనే దాదాపు 16 సినిమాలకు పనిచేసి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు.

తాజాగా మజిలీ చిత్రం విషయంలో పెద్ద తప్పే చేసారు. సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన గోపి..చివరి నిమిషం లో నేపధ్య సంగీతం ఇవ్వలేనని చేతులెత్తేశాడు.. దీంతో చేసేదేమి లేక నిర్మాతలు థమన్ తో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తి చేయించారు. సినిమా విడుదల ముందు గోపి ఫై చర్యలు తీసుకుంటే బాగోదని..సినిమా సక్సెస్ తర్వాత ఆయన ఫై చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయినా నిర్మాతలు ఇప్పుడు ఆయనపై చర్యలు తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.

వాస్తవానికి ఈ సినిమాలో ఆల్బమ్, నేపథ్య సంగీతానికి కలిపే గోపీ సుందర్‌కు నిర్మాతలు పారితోషికం చెల్లించారట. గోపీ సుందర్ మాత్రం అనుకున్న సమయానికి నేపథ్య సంగీతం ఇవ్వలేదని సమాచారం. అసలు ఆయన మొదలుపెట్టలేదని తెలుస్తోంది. దీనిపై నిర్మాతలకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదట. నేపథ్య సంగీతానికి ఇచ్చిన పారితోషికాన్ని గోపీ సుందర్ వెనక్కి ఇవ్వాల్సిందిగా నిర్మాతలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇదే విషయంపై వారు ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు కూడా చేయనున్నట్లు తెలుస్తోంది.