శ్రీదేవి మృతి : కంటతడి పెట్టిన మెగాస్టార్

అతిలోక సుందరి శ్రీదేవి మరణం సినీ ఇండస్ట్రీ, ప్రేక్షకులకు షాక్ కు గురిచేసింది. ఆమె మరణవార్త నిజమా ? అబద్దమా ? అంటూ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొనేంత షాకిచ్చింది. ఈ షాక్ లోనే టాలీవుడ్ కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి శీదేవి మరణ వార్త తెలిసిన వెంటనే కంటతడిపెట్టారు. ఆమెతో త‌న‌కు సినిమాల్లో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఉద్వేగానికి గురయ్యారు.

అతిలోక సుందరి మరణం పట్ల ఓ వీడియా ద్వారా తన సంతాపాన్ని తెలియజేశారు. “భారత సినీ రంగంలో శ్రీదేవి లాంటి నటి మరొకరు లేరు రారు. ఆమె విషయంలో భగవంతుడు చాలా అన్యాయం చేశాడు. ఇంత చిన్న వయసులో ఆమెను కోల్పోవడం బాధగా ఉంది. శ్రీదేవి కళ కోసమే పుట్టింది. కళే ప్రాణంగా బతికింది. ఆమెకున్న అంకితభావం మరెవరిలోనూ చూడలేదు. ‘జగదేక వీరుడు-అతిలోక సుందరి’లో ఇంద్రజ పాత్ర తన కోసమే పుట్టిందా? అన్నట్లు నటించి మెప్పించింది. శ్రీదేవితో నాకు కెరీర్‌ పరంగానే కాకుండా కుటుంబ సాన్నిహిత్యమూ ఉంది. ఇరు కుటుంబాల్లో ఏవైనా ఫంక్షన్లు జరిగితే ఒకరినొకరు ఆహ్వానించుకోవడం.. హాజరుకావడం జరుగుతుంటుంది. నా 60వ జన్మదినం రోజున బోనీకపూర్‌-శ్రీదేవి దంపతులు వచ్చి ఆశీర్వదించారు. ఆమెను ప్రత్యక్షంగా చూడటం అదే ఆఖరిసారి. ఈరోజు ఉదయం తను చనిపోయిందని విని చాలాసేపు నేను నమ్మలేదు. అంత గొప్పనటిని కోల్పోవడం నిజంగా భారతీయ పరిశ్రమ చేసుకున్న దురదృష్టం. ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. శ్రీదేవి భౌతికంగా మనమధ్య లేకపోయినా ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. సినీ రంగం ఉన్నంతవరకు ఆమె జీవించే ఉంటుంది” అన్నారు మెగాస్టార్.