రాళ్లపల్లి ఇకలేరు

ప్రముఖ నటుడు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు (73) తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శుక్రవారం తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే మాదాపూర్‌లోని మ్యాక్స్‌క్యూర్‌ ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ కన్నుమూశారు.

1974లో ‘స్త్రీ’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన రాళ్లపల్లి.. శుభలేఖ, ఖైదీ, ఆలయ శిఖరం, మంత్రిగారి వియ్యంకుడు, అభిలాష, శ్రీవారికి ప్రేమలేఖ, సితార, ఆలాపన, న్యాయానికి సంకెళ్లు, ఏప్రిల్‌ 1 విడుదల, సూర్య ఐపీఎస్‌, దొంగపోలీసు, కన్నయ్య కిట్టయ్య, సుందరకాండ, భలే భలే మగాడివోయ్‌ తదితర 850కి పైగా చిత్రాల్లో నటించారు. 1945 ఆగస్టు 15న అనంతపురం జిల్లా కంబదూరులో జన్మించిన రాళ్లపల్లికి ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తె మృతి చెందగా.. మరో అమ్మాయి అమెరికాలో ఉంటున్నారు.