ఆర్.ఎక్స్100.. రెండో రోజు అదే మైలేజ్ !

తెలుగు తెరపై ‘ఆర్.ఎక్స్100’ బండి దూసుకెళ్తోంది. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఆర్.ఎక్స్100’ వసుళ్లలో అదరగొడుతోంది. దర్శకుడు, హీరో-హీరోయిన్స్ అంతా కొత్తవారితో పెద్దగా అంచనాలు లేకుండా ‘ఆర్.ఎక్స్100’ థియేటర్స్ లోకి దూసుకొచ్చింది. ఫస్ట్ షోతోనే హిట్ టాక్ ని సొంతం చేసుకొంది. ఫస్ట్ డే మంచి మైలేజ్ ఇచ్చింది.

తొలి రోజే సగం డబ్బులు వచ్చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారమ్. ఈ సినిమా రూ. 2.70 కోట్లకు అమ్ముడు పోయింది. కొత్తదనం, పాజిటివ్ టాక్ తో విడుదలైన ఈ సినిమా తొలిరోజే రూ. 1.41 కోట్లు షేర్ ని రాబట్టింది. రెండో రోజు అదే జోరుని కొనసాగిందించింది. రెండు రాష్ట్రాల్లో రెండు రోజులకు గాను ఈ సినిమా 2.51 కోట్ల షేర్ ను వసూలు చేసింది. శని .. ఆదివారాల్లో ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

యూత్ ఫుల్ కంటెంట్ తో సినిమా తెరకెక్కడం, ట్రైలర్లతోనే ప్రేక్షకుల్ని ఆకర్షించేయడంతోనే సగం పనైపోయింది. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించిన వాటి జాబితాలో ఈ సినిమా చేరిపోవడం ఖాయమని తేలిపోయింది.