రివ్యూ : 2.ఓ

చిత్రం : 2.ఓ (2018)

నటీనటులు : రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌, అమీ జాక్సన్‌.. తదితరులు

సంగీతం : ఏఆర్‌ రెహమాన్‌

దర్శకత్వం : శంకర్‌

నిర్మాత : (లైకా ప్రొడక్షన్స్‌) ఎ.సుభాష్‌కరణ్‌, రాజు మహాలింగం

విడుదల తేదీ : 29నవంబర్, 2018

రేటింగ్ : 3.5/5

సామాజిక నేప‌థ్యం ఉన్న క‌థ‌ల్ని ఎంచుకుని, వాటిని సాంకేతికంగా ఉన్న‌తంగా చూపించడం దర్శకుడు శంకర్ ప్రత్యేకత. 2.ఓ కూడా అలాంటి కథే. దాదాపు నాలుగేళ్ల పాటు శ్రమించి.. రూ. 500కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ గా నటించారు. ఎమీ జాక్సన్ హీరోయిన్. 3జీ టెక్నాలజీ, 4డి సౌండ్‌ తో తెరకెక్కిన తొలి భారతీయ సినిమా ఇది. ఇండియన్ సినిమా స్థాయిని పెంచే సినిమా అని చిత్రబృందం చెబుతూ వచ్చింది. ఇలాంటి భారీ అంచనాల మధ్య 2.ఓ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. రోబోతో పోలిస్తే 2.ఓలో ఉన్న ప్ర‌త్యేక‌త‌లేంటి ? అవి ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొన్నాయి తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

హఠాత్తుగా భూమ్మీద సెల్ ఫోన్లు మాయమైపోతుంటాయి. ఇంటిపైకప్పులకి చిల్లులు పడి మరీ.. సెల్ ఫోన్స్ ఆకాశంలోకి ఎగిరి పోతుంటాయ్. ఈ హఠాత్పరిణామానికి ప్ర‌పంచం మొత్తం నివ్వెర‌పోతుంది. భూమ్యాక‌ర్ష‌ణ శ‌క్తికి మించి ఏదో బ‌ల‌మైన శ‌క్తి సెల్ ఫోన్ల‌ని లాక్కెళ్లిపోతోంద‌ని శాస్త్రవేత్తలు గ్ర‌హిస్తారు. ఇంత‌లో సెల్‌ఫోన్‌ల‌న్నీ అమ‌ర్చుకున్న ఓ ప‌క్షి ఆకార‌పు రూపం న‌గ‌రంలో చొర‌బ‌డి విధ్వంసం సృష్టిస్తుంటుంది. దాన్ని ఆపడానికి చిట్టి ‘ద రోబో’ని మ‌ళ్లీ రంగంలోకి దింపాల‌ని శాస్త్రవేత్తలు భావిస్తారు. వశీక‌ర్ (ర‌జ‌నీకాంత్‌) చిట్టికి మ‌ళ్లీ ప్రాణం పోస్తాడు. అత్యంత బ‌ల‌మైన ప‌క్షిరాజు (అక్ష‌య్ కుమార్‌)ని చిట్టి ఎలా ఎదుర్కొంది ? అసలు పక్షిరాజాలా అక్షయ్‌ మారడానికి దారి తీసిన కారణాలు ఏంటి ? అనేది మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :

* విజువ‌ల్ ఎఫెక్ట్స్‌

* చిట్టి – ప‌క్షిరాజు పోరాట సన్నివేశాలు

* రజనీ, అక్షయ్ ల నటన

* ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌

* క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

* లేవనే చెప్పాలి

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

సెల్ ఫోన్‌ల వ‌ల్ల వ‌చ్చే శ‌బ్ద‌త‌రంగాల వ‌ల్ల ప్ర‌కృతి ఎంత న‌ష్ట‌పోతోందో, భ‌విష్య‌త్తులో ఎన్ని వినాశాలు చూడాల్సి వ‌స్తుందో… ‘2.ఓ’ సినిమాలో క‌ళ్ల‌కు క‌ట్టారు శంకర్. ఓ సమస్యతో సినిమా మొదలెట్టాడు. భూమ్మీద ఉన్న సెల్ ఫోన్లు హఠాత్తుగా మాయమైపోవడం. దానికి కారణం ఏంటన్నది పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నకి శాస్త్రవేత్తలు సమాధానం వెతికే లోపు.. పక్షిరాజు విధ్వాంసాలు మొదలు. ఆ పక్షరాజుని ఆపేందుకు చిట్టి రోబోని మళ్లీ రంగంలోకి దింపే ప్రయత్నం. చిట్టిరోబో-పక్షరాజు మధ్య పోరాటలు. ఇవన్నీ విజువల్ వండర్ గా చూపించేశారు దర్శకుడు. వాటిని మాటల్లో చెప్పడం కష్టం. చూసి అనుభవించాల్సిందే.

కథ కంటే.. ఈ సినిమాని విజువ‌ల్ వండ‌ర్‌గా తీర్చిదిద్ద‌డంపైనే దర్శకుడు ఫోకస్ పెట్టాడు. గ్రాఫిక్స్ అబ్బుర‌ప‌రుస్తాయి. ముఖ్యంగా రజనీ, అక్షయ్ ఎంట్రీ సన్నివేశాలు, ఇంటర్వెల్ ఏపీసోడ్ అదిరిపోయాయి. ఇక, సెకాంఢాఫ్ ని జెడ్ స్వీడుతో నడిపించాడు.చిట్టి-పక్షిరాజు ఆదిపత్యం కోసం పోటీపడే సన్నివేశాలు అదుర్స్. సినిమాలో చివరి 40నిమిషాలు హైలైట్. రజనీ మూడు పాత్రల్లో అదరగొట్టేశాడు. అక్షయ్ గెటప్ బాగుంది. ఆయనలో కొత్త యాంగిల్ ని పక్షిరాజుగా పాత్రతో చూడొచ్చు. ఎమీ జాక్సన్ ఉన్నంతలో భాగా చేసింది. మిగితా నటీనటులకి పెద్ద నటించే స్కోప్ దొరకలేదు.

సాంకేతికంగా :

సాంకేతిక విష‌యాన్నే కథగా ఎంచుకొన్నారు. టెక్నాల‌జీకే పెద్ద పీట వేశాడు. పాటలు సాదాసీదాగా అనిపించినా.. నేపథ్య సంగీతంలో ఆర్‌.ఆర్‌లో రెహ‌మాన్ మార్క్ క‌నిపించింది. నీరవ్‌ షా అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ఇండియన్‌ సినిమాలో 4డీ సౌండ్‌ టెక్నాలజీని వాడి మరో మాయా ప్రపంచంలోకి తీసుకెళ్లారు రసూల్‌. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా :

ఇది ఫక్తూ శంకర్ సినిమా. ఆయన మార్క్ సామాజిక నేపథ్యం ఉన్న కథతో తెరకెక్కింది. కాకపోతే.. ఇందులో శంకర్ మార్క్ ఎమోషనల్ సీన్స్ మిస్సయ్యాయి. ఇదో విజువల్ వండర్. అంచనాలని రెట్టింపు చేసేలా అవి ఉన్నాయి. త్రీడీలో చూడ‌గ‌లిగితే… ఆ ఎఫెక్ట్స్ మ‌రింత బాగుంటాయి.

రేటింగ్ : 3.5/5