రివ్యూ : దేవ్

చిత్రం : దేవ్ (2019)

నటీనటులు : కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్, నిక్కీ గల్రాని, రమ్యకృష్ణ తదితరులు

సంగీతం : హరీష్ జైరాజ్

దర్శకత్వం : రజత్ రవిశంకర్

నిర్మాత : ఠాగూర్ మధు

రిలీజ్ డేటు : 14 ఫిబ్రవరి, 2019.

రేటింగ్ : 2.5/5

టాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ ఉన్న కోలీవుడ్ హీరోల్లో కార్తీ ఒకరు. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతుంటుంది. మంచి కలెక్షన్స్ తెచ్చిపెడుతుంటాయ్. కార్తీ తాజా చిత్రం ‘దేవ్’. రజత్ రవిశంకర్ దర్శకుడు. కార్తీ జంటగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఈ సినిమా కోసం కార్తీ స్టయిలీష్ లుక్ లోకి మారిపోయాడు. టీజర్, ట్రైలర్స్ ఆకట్టుకొనే ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. భారీ అంచనాల మధ్య ప్రేమికుల రోజు కానుకగా ‘దేవ్’ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. మరీ.. దేవ్ ఎలా ఉన్నాడు.. ? ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొన్నాడు ?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

దేవ్ రామలింగం (కార్తీ) అడ్వంచర్స్ అంటే ఇష్టపడే కుర్రాడు. ఎప్పటికైనా ఎవరెస్ట్ అధిరోహించాలనేది అతడి కల. మేఘన (రకుల్ ప్రీత్) అనే యంగ్ బిజినెస్ ఉమెన్ తో ప్రేమలో పడతాడు. ఐతే, మేఘన మాత్రం కార్తీని పట్టించుకోదు. మగాళ్లంతా ఆడవారిని వాడుకునే రకమే అని ఆమె అభిప్రాయం. దానికి ఓ బలమైన కారణం ఉంటుంది. అదేంటీ ? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇలాంటి అమ్మాయిని దేవ్ ఎలా ప్రేమలో పడేశాడు ? ప్రేమతో పాటు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలనే దేవ్ కల తీరిందా.. ?? అన్నది కథ.

ప్లస్ పాయింట్స్ :

* కార్తీ నటన

* సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

* కొత్తదన లేని కథ-కథనం

* సంగీతం

* క్లైమాక్స్

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

దర్శకుడు రవిశంకర్ కి ఇదే తొలిచిత్రం. అడ్వెంచర్స్ తో కూడిన లవ్ స్టోరీ గా దేవ్ ని మల్చాలనుకున్నాడు. హీరోకి అడ్వెంచర్స్ మీదున్న ఇంట్రెస్ట్ ని హైలెట్ చేస్తూ సినిమా నడిపించాడు. మధ్యలో హీరోయిన్ తో ప్రేమని జోడించాడు. ఐతే, దేన్ని ఇంట్రెస్టింగ్ గా చూపించలేకపోయాడు.

ఫస్ట్ హాఫ్ లో కార్తీ స్నేహితులతో గడిపే క్షణాలు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో ఉక్రెయిన్ కి వెళ్లడం, బిజినెస్ విమెన్ అయిన రకుల్ ని ప్రేమించడం సన్నివేశాలతో సాదాసీదాగా గడిచిపోయింది. ఇక సెకండ్ హాఫ్ లో రకుల్ ని ప్రేమలోకి దింపడం, మరోవైపు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి శిక్షణ తీసుకోవడం ఏపీసోడ్స్ తో సినిమాని నడిపాడు. ట్విస్ట్ లు కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ ఎక్కడా కనిపించవు. దీంతో.. సినిమా చప్పగా సాగింది.

ఇక, దేవ్ పాత్రలో కార్తీ ఒదిగిపోయాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. యాక్షన్స్ సీన్స్ లోనూ అదరగొట్టాడు. ప్రేమలో పడిన తర్వాత మొదలయ్యే సంఘర్షణలకు సంబంధించిన సన్నివేశాల్లో భావోద్వేగాలు అద్భుతంగా పండించాడు. బిజినెస్ ఉమెన్, సెల్ఫి‌ష్‌గా ఆలోచించే ప్రియురాలి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ మెప్పించింది.
హీరో తండ్రిగా ప్రకాష్ రాజ్, హీరోయిన్ తల్లిగా రమ్యకృష్ణ, హీరో ఫ్రెండ్ పాత్రలో ఆర్‌జె విఘ్నేష్‌కాంత్, ఇతర నటీనటులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికంగా :

సినిమాటోగ్రఫీ బాగుంది. అదే సినిమాలో హైలైట్. హ్యారిస్ జై రాజ్ అందించిన పాటలు ఆకట్టుకొనేలా లేవు. నేపథ్య సంగీతం కూడా సాదాసీదాగా ఉంది. సినిమాలోని చాలా సన్నివేశాలకి కత్తెరపెట్టొచ్చు. ఫస్ట్, సెకాంఢాఫ్ లోనూ సినిమా స్లోగా సాగింది. నిర్మాణ విలువలు పర్వాలేదు.

చివరగా : మన పక్కింటి అబ్బాయిలా కనిపించే కార్తీ సినిమాలని యూత్ తో పాటు, ఫ్యామిలీ ప్రేక్షకులు ఇష్టపడుతుంటారు. ఐతే, దేవ్ లో కార్తీని అడ్వంచర్స్ అంటే ఇష్టపడే కుర్రాడిలా చూపించాడు దర్శకుడు. ఆ పాత్రకి కార్తీ సరిగ్గా సరిపోయాడు కూడా. కథ-కథనంలో బలం లేకపోవడంతో.. ‘దేవ్’ సాదాసీదాగా కనిపిస్తాడు.

రేటింగ్ : 2.5/5