రివ్యూ : ఖాకి

khaki

చిత్రం : ఖాకి
నటీనటులు : కార్తి, రకుల్ ప్రీత్ సింగ్
సంగీతం : జిబ్రాన్
దర్శకత్వం : హెచ్. వినోత్
నిర్మాత : ఎస్.ఆర్ ప్రకాష్ బాబు, ఎస్.ఆర్ ప్రభు
రేటింగ్ : 3/5

టాలీవుడ్’లోనూ మంచి మార్కెట్ ఉన్న కోలీవుడ్ స్టార్ కార్తీ. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతూ ఉంటుంది. కార్తీ తాజా చిత్రం “ఖాకీ”. హెచ్. వినోత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. కార్తీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టింది. ఈ పోలీస్ థ్రిల్లర్ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చేశాడు. మరీ.. ఖాకి డ్రెస్తుల్లో కార్తీ తెలుగు ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొన్నాడు. అసలు ఖాకీ కథేంటో తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళ్లదాం పదండీ.. !

కథ :
హైవేల పక్కనున్న ఇళ్లలోకి చొరబడి దోపిడీలకు పాల్పడి, దారుణంగా హత్యలు చేస్తుంటుంది ఓ ముఠా. ఆ కేసుకు సంబందించిన ఫైల్’ని డీఎస్పీగా ఛార్జ్ తీసుకున్న ధీరజ్ (కార్తి) అప్పగిస్తారు. ఆ దోపిడీ హత్యల వెనకున్న ముఠా ఎవరు ? వాళ్ళ నైపథ్యం ఏమిటి ?? ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ధీరజ్ ఈ కేసుని ఎలా చేధించాడు ? ప్రియ (రకుల్)ని ప్రేమ్ంచి పెళ్లి చేసుకొన్న ధీరజ్ జీవితంలో ఏం కోల్పాయాడు ? అన్నది మిగితా కథ.

ఇప్పటివరకు తెలుగు తెరపైకి చాలా ఖాకి కథలొచ్చాయి. వీటిలో కొన్ని యాక్షన్ హైలైట్ అయిన సినిమాలే ఎక్కువ. యాక్షన్ కు తోడు కామెడీ, డ్రామాతోను ఆకట్టుకొన్న సినిమాలొచ్చాయి. అయితే, ఈ ఖాకి కాస్త కొత్తగా కనిపించాడు. ఒక కరడుగట్టిన ముఠాను అంతం చేయడమే లక్ష్యంగా పోలీసు బృందం చేసే పోరాటం నేపథ్యంలో ఈ సినిమాను సహజంగా తెరకెక్కించారు. ఎక్కడా వీరోచిత విన్యాసాలు కనిపించవు. అరుపులు, కేకలు, ఛాలెంజ్ లు విసురుకోవడాలు అస్సలు కనిపించవు. తెరపై నిజ జీవితాలను, నిజమైన పోలీసులను చూస్తున్నట్లే ఉంటుంది.

నటీనటుల ఫర్ ఫామెన్స్ :
ఓ నిజమైన ముఠా చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఆ ముఠా నేపథ్యం గురించి తెరపై చూపించిన విధానం బాగుంది. శత్రువులను వేటాడ‌ట‌మే కథ.. ఇందులో వూహించని ట్విస్టులు ఉండవు. కాకపోతే కథకు ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వగలుగుతాడు. దర్శకుడు హెచ్. వినోత్ ఓ నిజమైన ముఠాపై చేసిన పరిశోధన. దానికి కథగా రాసుకోవడం. రాసుకొన్న కథని సహజత్వానికి దగ్గర తెరపై చూపించడంలో సక్సెస్ అయ్యారు. ఖాకి డ్రెస్సులో కార్తీ నటన చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ ని అద్భుతంగా తెరకెక్కించారు. రకుల్ ప్రీత్ సింగ్ నటనతో ఆకట్టుకొంది. సినిమా స్టార్టింగ్ లో కార్తీ-రకుల్ మధ్య లవ్ ట్రాక్ ఆకట్టుకొనేలా ఉంది. అభిమన్యు సింగ్‌ చూపులతోనే పాత్రను రక్తి కట్టించే ప్రయత్నం చేశాడు.

సాంకేతికంగా :
ఈ సినిమా సక్సెస్ లో ఎక్కువ క్రెడిట్ దర్శకుడు వినోత్ కు దక్కుతుంది. కథపై ఆయన చేసిన పరిశోధన ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనబడుతుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. రాజస్థాన్ వంటి ఎడారి, కొండ ప్రాంతాలని బాగా చూపించారు. ఘిబ్రన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అయితే పాటలే సాదాసీదాగా అనిపిస్తాయి. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : యాక్షన్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులని కార్తీ ‘ఖాకి’ ఏ మాత్రం నిరాశపరచదు.

రేటింగ్ : 3/5