రివ్యూ : మహానుభావుడు

mahanu bavudu

చిత్రం: మహానుభావుడు
నటీనటులు: శర్వానంద్‌.. మెహరీన్‌.. నాజర్‌.. వెన్నెల కిషోర్‌.. తదితరులు
సంగీతం: తమన్‌
ఛాయాగ్రహణం: నాజర్‌ షఫీ
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాతలు: వి. వంశీకృష్ణ, ప్రమోద్‌
రచన, దర్శకత్వం: మారుతి
బ్యానర్‌: యువీ క్రియేషన్స్‌
విడుదల తేదీ: 29-09-2017
రేటింగ్ : 3/5

శర్వానంద్‌ మాంచి జోరులో వున్నాడు. రన్ రాజా రన్.. ఎక్స్ ప్రెస్ రాజా లాంటి రెండు సూపర్ హిట్లు అందుకున్నాడు. దర్శకుడు మారుతి వినోదాత్మక చిత్రాలు అదించడంలో దిట్ట. ఇప్పుడు వీరిద్దరూ కలసి మహానుభావుడు చేశారు. ఈ సినిమా టీజర్ ట్రైలర్ చాలా ఆసక్తని రేపాయి. మరి, టీజర్ ట్రైలర్ లో కనిపించిన ఆసక్తి సినిమాలో కనిపించిందా ? ఇంతకీ ఈ మహానుభావుడి కధ ఏమిటి ?

క‌థ‌: ట్రైలర్ లో చూపించిందే. ఆనంద్ (శ‌ర్వానంద్)కి ఓసీడీ (అబ్సెసివ్ కంప‌ల్సివ్ డిజార్డర్‌). భయంకరమైన అతి శుభ్రత. షేక్ హ్యాండ్ ఇవ్వాల‌న్నా ప‌ది సార్లు ఆలోచిస్తాడు. ఒంట్లో బాగాలేక‌పోతే అమ్మని కూడా ద‌గ్గ‌ర‌కి తీసుకోడు. ఇలాంటి ఆనంద్‌కి మేఘ‌న (మెహ‌రీన్‌) ప‌రిచ‌యం అవుతుంది. త‌న‌కీ శుభ్ర‌త అంటే ఇష్టం. ఆ ల‌క్ష‌ణం చూసే మేఘ‌న‌ని ఇష్ట‌ప‌డ‌తాడు. ఓ రోజు మేఘ‌న‌కు త‌న మ‌న‌సులో మాట చెబుతాడు. మేఘ‌న కూడా స‌రే అంటుంది. కానీ… మా నాన్న‌(నాజ‌ర్‌) కు న‌చ్చాలి.. అనే కండీష‌న్ పెడుతుంది. మ‌రి మేఘ‌న నాన్న కు ఆనంద్ న‌చ్చాడా? లేదా?? త‌న ప్రేమ‌ని గెలిపించుకోవ‌డానికి ఆనంద్ ఎన్ని కష్టాలు ప‌డ్డాడు? అతని అతి శుభ్రం వ‌ల్ల ఎదురైన స‌మ‌స్య‌లేంటి? ఇవన్నీ వెండితెరపై చూడాల్సిందే.

బ‌లాలు
+ క‌థ‌ నేపధ్యం
+ శ‌ర్వానంద్‌ నటన
+ వినోదం

బ‌ల‌హీన‌త‌లు
– రొటీన్ క్లైమాక్స్‌
– ఆకట్టుకొని పాటలు

ఎలావుంది : మారుతి తీసిన ‘భలే భలే మగాడివోయ్‌’.. మహానుభావుడు కి దగ్గర పోలికలు వున్నాయి. ‘మతిమరపు’ కుర్రాడితో నవ్వుల విందు అందించిన మారుతి ఈసారి ‘పరిశుభ్రత’కి ప్రాణాలిచ్చేసే ‘మహానుభావుడి’ని చూపించాడు. ‘భలే భలే మగాడివోయ్‌’ మాదిరిగానే ఈ మహానుభావుడికి కూడా తనకున్న బలహీనతే కధలో మెయిన్ కాన్ ఫ్లిక్ట్. తనకున్న సమస్యని అధిగమించి తన ప్రేమని ఎలా దక్కించుకుంటాడనేది ఈ సినిమా స్టోరీ. భలే భలే మగాడివోయ్‌ ఫార్మలనే ఇక్కడా ఫాలోయ్యాడు మారుతి. చాలా వరకూ సక్సెస్ అయ్యాడు కూడా. ఈ సినిమా మొత్తంని వినోదంతో లాగుకువచ్చాడు. హీరో పాత్ర‌ని ప‌రిచ‌యం చేసే విధానం, ఆఫీసులో అతి శుభ్ర‌త వ‌ల్ల చేసిన హంగామా, నాజ‌ర్‌తో భోజ‌నం చేసే సీన్‌, ప‌ల్లెటూర్లో క‌థానాయ‌కుడు ప‌డిన పాట్లు, స్నానాల స‌న్నివేశం ఇవ‌న్నీ ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్‌టైన్ చేస్తాయి. అయితే అతి శుభ్రం కొన్ని చోట్ల ‘అతి’ చస్తున్నారేమో అనిపిస్తుంది. అలాగే సినిమాకి రొటీన్ క్లైమాక్స్ ఇచ్చాడు దర్శకుడు. ఈ విషయంలో జాగ్రత్త తీసుకొని వుంటే ఇంకా బావుండేది.

ఎవరు ఎలా చేశారు ?

ఓసీడీ వ‌ల్ల పాట్లుప‌డే కుర్రాడిగా శ‌ర్వా ఇమిడిపోయాడు. వినోదానికి స్కోప్ ఉన్న క‌థ‌ల్ని ఎంచుకొంటున్నప్పటి నుంచీ శ‌ర్వా స‌క్సెస్ రేటు బాగుంది. ఈసారీ త‌న కామెడీ టైమింగ్‌ని అద్భుతంగా ప‌లికించాడు. మెహ‌రీన్ అందంగా క‌నిపించింది. ఐతే నటన విషయంలో ఇంకా మెరుగుపడాలి. వెన్నెల కిషోర్ త‌న‌దైన కామెడీ టైమింగ్ తో న‌వ్వులు పూయిస్తాడు. త‌మ‌న్ సంగీతంలో మ‌హానుభావుడ‌వేరా.. పాట బావుంది. మిగతా పాటలు గుర్తుండవు. కెమెరా ప‌నిత‌నం, ఆర్ట్ విభాగాలు ఆక‌ట్టుకొన్నాయి . యువీ క్రియేష‌న్స్ భారీదనం కనిపించింది.

చివరిగా.. మహానుభావుడు ‘క్లీన్’ వినోదం