రివ్యూ : మిస్ట‌ర్ మ‌జ్ను

చిత్రం : మిస్ట‌ర్ మ‌జ్ను(2019)

నటీనటులు : అఖిల్, నిధిఅగ‌ర్వాల్‌, రావు ర‌మేష్‌, నాగబాబు, ప్రియ‌ద‌ర్శి.. త‌దిత‌రులు

సంగీతం : థమన్

దర్శకత్వం : వెంకీ అట్లూరి

నిర్మాత : బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్

రిలీజ్ డేటు : 25జనవరి, 2019

రేటింగ్ : 2.75/5

‘టాలీవుడ్ కు మరో మహేష్ బాబు దొరికాడు’ అఖిల్ అక్కినేని హీరోగా ఎంట్రీ ముందుకు వినిపించిన మాట ఇది. అఖిల్ అందం. అప్పటికే ఆయనకు గల క్రేజ్ ని చూస్తే అది నిజమే అనిపించింది. అఖిల్ సూపర్ స్టార్ అవుతాడు. జూనియర్ ప్రిన్స్ అనిపించుకొంటాడని అందరూ భావించారు. ఈ నేపథ్యంలోనే అఖిల్ ఎంట్రీ సినిమా ‘అఖిల్’ని గ్రాండ్ గా తీసుకొచ్చారు. స్టార్ హీరో రేంజ్ లో బడ్జెట్ ఖర్చు పెట్టారు. ఐతే, ‘అఖిల్’ అట్టర్ ప్లాప్ అయ్యింది. అఖిల్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది. ఆ డ్యామేజ్ ని రెండో సినిమా ‘హలో’లో కవర్ చేసుకొనేందుకు ట్రై చేశాడు అఖిల్.

ఐతే, ‘హలో’ మంచి సినిమా అనిపించుకొన్నా.. కమర్షియల్ హిట్ కాలేదు. ఈ నేపథ్యంలో తన మూడో చిత్రం కోసం తన వయసుకి తగ్గ కథని ఎంచుకొన్నాడు అఖిల్. అదే ‘మిస్ట‌ర్ మ‌జ్ను’. ‘తొలిప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో వహించారు. ఇందులో అఖిల్ అమ్మాయిల వెంట పడుతూ కనిపిస్తాడు. వారిని ప్రేమిస్తాడు. ప్రేమలో పడేస్తాడు. అది కేవలం నెలరోజులు మాత్రమే. ఆ తర్వాత బ్రేకప్. మళ్లీ కొత్త అమ్మాయి. కొత్త లవ్ స్టోరీ. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ అఖిల్ కి బాగా సూటయినట్టు టీజర్, ట్రైలర్’తో అనిపించింది.

మరీ.. మొత్తం సినిమాలోనూ అఖిల్ అదే ఫీలింగ్ కలిగించాడా.. ? అక్కినేని ఫ్యామిలీకి అచ్చొచ్చిన మ‌జ్ను టైటిల్ తో
మోడ్రన్ మ‌జ్ను అఖిల్ హిట్ కొట్టాడా.. ?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

విక్రమ్ కృష్ణ అలియాస్ విక్కీ (అఖిల్) ఓ ప్లేబాయ్. యుఎస్‌లో ఎం.ఎస్‌.చ‌దువుతుంటాడు. చెల్లెలి పెళ్లి కోసం లండన్ నుంచి ఇండియా వస్తున్నప్పుడు ఫ్లైట్ లో నికిత అలియాస్ నిక్కి (నిధి అగర్వాల్)ను చూస్తాడు. ఆల్రెడీ విక్కీ గురించి నిక్కీకి తెలుసు. అందువల్ల, అతడికి దూరంగా ఉంటుంది. ట్విస్ట్ ఏంటంటే.. ? విక్కీకి కాబోయే బావ చెల్లెలు నిక్కీ. ముందు విక్కీని దూరం పెట్టిన నిక్కీ మెల్లగా అతణ్ణి ప్రేమిస్తుంది. తన ప్రేమను వ్యక్తం చేస్తుంది కూడా.

ఐతే, నెల రోజులకు మించి ఏ అమ్మాయితోనూ రిలేషన్‌షిప్‌లో ఉండటం అలవాటు లేని విక్కీ.. ఈ ప్రేమ తన వల్ల కాదని చెబుతాడు. కనీసం 2 నెలలు రిలేషన్‌షిప్‌లో ఉండటానికి ప్రయత్నిద్దామని విక్కీని కన్వీన్స్ చేస్తుంది నిక్కీ. ఆ టైంలోనూ నిక్కీ ప్రేమను అర్థం చేసుకోడు. ఇబ్బందిగా ఫీలవుతాడు. వీరి ప్రేమ సంగతి తెలిసి.. వీరిద్దరికి పెళ్లి చేద్దామని ఇరు కుటుంబాలు నిర్ణయిస్తాయి. ఇంతలో విక్కీకి బ్రేకప్ చెబుతుంది నిక్కీ. ఆ తర్వాత నిక్కీ ప్రేమ విక్కీకి అర్థం అవుతుంది. అప్పుడు విక్కీ ఏం చేశాడు. తిరిగి నిక్కీని ఒప్పించాడా.. ?? వీరికి పెళ్లి జరిగిందా.. ? అన్నది కథ.

ప్ల‌స్ పాయింట్స్

* అఖిల్ న‌ట‌న‌

* సినిమాటోగ్రఫీ

* డైలాగ్స్

మైన‌స్ పాయింట్స్

* రొటీన్ కథ

* సరైన కాన్‌ఫ్లిక్ట్ లేదు

* ఫ్యామిలీ ఎమోష‌న్స్

* సెకండాఫ్‌

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

దర్శకుడు కథను ప్రారంభించిన విధానం బావుంది. కొన్ని సన్నివేశాలను బలంగా రాసుకున్నాడు. మాటలు కూడా. కానీ, సినిమా అంతా అదే టెంపో కంటిన్యూ చేయలేకపోయాడు. ఫస్టాఫ్ ని బాగా డీల్ చేశాడు. కథ లండన్ నుంచి ఇండియాకు షిఫ్ట్ అయిన తరవాత కూడా కుటుంబ అనుబంధాలను చూపించిన తీరు బావుంది.

ప్లేబాయ్‌గా అఖిల్‌ పర్‌ఫెక్ట్‌గా సూటయ్యాడు. అక్కినేని హీరోలకు ఉన్న రొమాంటిక్ ఇమేజ్ కూడా కలిసొచ్చింది.
సినిమాకు అఖిల్ నటనే బలం. ఐతే, ఏమోషనల్ సన్నవేశాల్లో ఇంకాస్త మెరుగుపడాలి. నిధి అగర్వాల్ అందంగా కనిపించింది. నటనలో ఫర్వాలేదనిపించింది. డైలాగులకు లిప్ సింక్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యింది.

ప్రియదర్శి ఆకట్టుకున్నాడు. ‘హైపర్’ ఆది పాత్ర క్లిక్ కాలేదు. సెకండాఫ్‌లో దిల్‌రాజు మ‌న‌వ‌డు ఆర్ష‌న్ రెడ్డి సీన్లు బావున్నాయి. కొంత‌లో కొంత రిలీఫ్‌గా అనిపించాయి. నటీనటుల్లో పేరున్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ, ఎవరికీ పెద్దగా నటించే అవకాశం రాలేదు.

సాంకేతికంగా :

థమన్ అందించిన పాటల్లో రెండు బాగున్నాయి. నేపథ్యం సంగీతంలోనూ థమన్ మార్క్ కనబడింది. సినిమాటోగ్రఫీ బాగుంది. సెకాంఢాఫ్ లో సినిమా కాస్త నెమ్మదించింది. కొన్ని సీన్స్ కి కత్తెరపెట్టొచ్చు. కొన్ని డైలాగ్స్ బాగా పేలాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా :

యూత్ కి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. ఐతే, ఇటీవల వచ్చిన రెండు మూడు సినిమాలని గుర్తు చేసేలా సాగింది. ఫస్టాఫ్ ని ఎంజాయ్ చేసి.. సెకాంఢాఫ్ ని భరించే ఓపిక ఉన్న వారికి ‘మిస్ట‌ర్ మ‌జ్ను’ ఓ మంచి ఆప్షన్.

రేటింగ్ : 2.75/5