రివ్యూ : పేపర్ బాయ్

చిత్రం : పేపర్ బాయ్

నటీనటులు : సంతోష్‌ శోభన్‌, రియా సుమన్‌ , తాన్య హోపే

సంగీతం : భీమ్స్‌ సిసిరొలియో

దర్శకత్వం : జయశంకర్‌

నిర్మాత : సంతప్‌ నంది, రాములు, వెంకట్‌, నరసింహా

రిలీజ్ డేటు : 31 ఆగస్టు, 2018.

రేటింగ్ : 2.75/5

సంపత్ నంది.. దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొన్నాడు. మాస్ ని అలరించే చిత్రాలని చేశాడు. ఐతే, ఈ దర్శకుడు నిర్మాతగా మారి విభిన్నమైన సినిమాలని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘గాలిపటం’ మంచి సినిమా అనిపించుకొంది. సంపత్ నంది నిర్మాణంలో వస్తున్న మరో చిత్రం ‘పేపర్ బాయ్’. జయశంకర్‌ దర్శకుడు. సంతోష్‌ శోభన్‌ హీరోగా, రియా, తాన్య హోప్ హీరోయిన్లుగా నటించారు.

ప్రముఖ దర్శకుడు శోభన్ తనయుడే సంతోష్ శోభన్. ‘వర్షం’తో ప్రభాస్ కు తొలి హిట్ ఇచ్చిన దర్శకుడు శోభన్. అలాగే మహేష్ తో ‘బాబీ’ సినిమా తీశాడు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్, మహేష్ లిద్దరు పేపర్ బాయ్ పై ఆసక్తి చూపించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయ్. భారీ అంచనాల మధ్య పేపర్ బాయ్ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరీ.. పేపర్ బాయ్ ఎలా ఉన్నాడు ? ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొన్నాడు.. ?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

ఆటో డ్రైవర్ కొడుకు రవి (సంతోష్ శోభన్). బి.టెక్ చేస్తూనే ఆర్ధిక ఇబ్బందులు కారణంగా ‘పేపర్ బాయ్’గా పని చేస్తుంటాడు. బుక్స్ బాగా చదివే అలవాటు ఉన్న రవి.. నాలుగేళ్లుగా ధరణి (రియా)ని ప్రేమిస్తుంటాడు. ఆమెను చూడటం కోసం ఆమె ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు. ఈ క్రమంలో ఇద్దరికీ పరిచయం అవ్వడం. రవి మంచి తనం విలువలు గురించి తెలుసుకున్న ధరణి కూడా రవిని ఇష్టపడుతుంది. తన పేరెంట్స్ కి చెప్పి పెళ్లికి ఒప్పిస్తోంది. వీరికి నిశ్చితార్ధం కూడా జరుగుతుంది. ఆ తర్వాత రవికి ధరణిని వదిలేసి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తోంది. దానికి కారణాలేంటీ ?? వీరి ప్రేమకథకు ముంబైలో ఉండే మేఘ (తాన్యా హోపే)కు సంబంధం ఏంటి..? మళ్ళీ రవి, ధరణి ఎలా కలుస్తారు ?? అనేది మిగితా కథ.

ప్లస్‌ పాయింట్స్‌ :

* సంతోష్‌ శోభన్‌ నటన

* మాటలు

* నేపథ్య సంగీతం

మైనస్‌ పాయింట్స్‌ :

* అక్కడక్కడ సాగదీత

ఎలా ఉందంటే ?

పేదింటి అబ్బాయి.. పెద్దింటి పిల్ల. వీరి మధ్య ప్రేమ, పెళ్లికి అండంకిలు.. కథాంశంతో చాలా సినిమాలే వచ్చాయి. ఐతే, ఈ పాయింట్ కు కొత్త కోటింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. దానికి సంపత్ నంది అందించిన కవితాత్మకమైన సంబాషణలని జోడించాడు. ఐతే, చాలా ఆసక్తిగా కథని ప్రారంభించిన.. దర్శకుడు ఆ ఫీల్ తగ్గకుండా ఉంచడంలో విఫలమయ్యాడు. దీనికితోడు.. స్లో నేరేషన్, కథతో సంబంధం లేని కామెడీ సన్నివేశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి.

ఎవరెలా చేశారంటే ?
హీరో సంతోష్ శోభన్ నటన సినిమాకే హైలైట్. ఇది ఆయన చేసిన రెండో సినిమా అంటే నమ్మలేం. చాలా అనుభవం ఉన్న కుర్రాడిలా నటించారు. అచ్చం పేపర్ బాయ్ పాత్రలో ఇమిడిపోయారు. ఎమోషనల్ సన్నివేశాలని చాలా ఈజీగా చేశాడు. ఈ కుర్రాడికి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ బాగా సూటవుతాయని ఈ చిత్రం రుజువు చేసింది. ‌హీరోయిన్ రియా తన నటనతో ఆకట్టుకుంది. మరో హీరోయిన్ తాన్యా ఫర్వాలేదనిపించింది. హీరో స్నేహితుల గ్యాంగ్ నటన బాగుంది. మిగితా నటీనటులు తమ తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతికంగా :
సంపత్‌ నంది సంభాషణలు బాగున్నాయి. కవితాత్మకంగా సాగే సంభాషణలు ఆకట్టుకుంటాయి. భీమ్స్‌ సంగీతం, సురేష్‌ బొబ్బిలి నేపథ్య సంగీతం బాగా కుదిరాయి. సౌందర్‌ రాజన్‌ సినిమాటోగ్రఫి బాగుంది. కొన్ని చోట్ల సినిమా నెమ్మదిగా సాగినట్టు అనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : పేపర్ బాయ్.. ఫర్వాలేదనిపించాడు

రేటింగ్ : 2.75/5