రివ్యూ : రచయిత

చిత్రం : రచయిత (2018)
నటీనటులు : విద్యాసాగర్ రాజు, సంచిత పదుకొనే
సంగీతం : జెబి, షాన్ రెహమాన్
దర్శకత్వం : విద్యాసాగర్ రాజు
నిర్మాత : కళ్యాణ్ ధూళిపాళ్ల
రిలీజ్ డేటు : 17 ఫిబ్రవరి, 2018.
రేటింగ్ : 2.5/5.

నటుడు విద్యాసాగర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “రచయిత”. సీనియర్ హీరో జగపతి బాబు స్పెషల్ గా ప్రమోట్ చేసిన చిత్రమిది. ఐతే, సడెన్ గా రిలీజ్ డేటు ప్రకటించుకొని ప్రేక్షకుల ముందుకొచ్చేశాడు ‘రచయిత’. మరీ ‘రచయిత’ కలం నుంచి అద్భుతాలేంటీ ? అవి ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొన్నాయి. మొత్తంగా ప్రేక్షకులని రచయిత ఇంప్రెస్ చేయగలిగాడా ? లేదా ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :
ఆదిత్య వర్మ(విద్యాసాగర్‌ రాజు) ప్రముఖ కథా రచయిత. ఈసారి కొత్త కథని రాయడానికి జనజీవనానికి దూరంగా ఓ నిర్మానుష్య ప్రదేశాన్ని ఎంచుకుంటాడు. అక్కడికి వెళ్లేకంటే ముందే చిన్నతనంలో ప్రేమించిన అమ్మాయి పద్మావతి (సంచిత పదుకొనే)ని పెళ్లి చేసుకోవడానికి ఆమె తల్లిదండ్రులను కలుస్తాడు. ఐతే, అప్పటికే పద్మావతికి మనోహర్‌ అనే వ్యక్తితో నిశ్చితార్థం అవుతుంది. ఓ ప్రమాదంలో మనోహర్ చనిపోవటంతో ఆ విషయాలను ఆదిత్య వర్మకు చెప్పకుండా పద్మావతిని పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేస్తారు ఆమె తల్లిదండ్రులు.

పద్మావతిని ఆదిత్య వర్మతో పాటు పంపిస్తారు. ఆమె తన గతాన్ని మర్చిపోయి ఆదిత్య వర్మకు దగ్గరయ్యే సమయంలోనే ఆదిత్య వర్మ తన కథ మొదలు పెడతాడు. అదికూడా పద్మావతి జీవితంలో జరిగిన సంఘటనలే ఆదిత్య కథగా రాస్తుంటాడు. ఆదిత్య వర్మ రాసినలో మనోహర్ ఎలా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన ఆత్మగా మారాడా ?? చివరకు ఆదిత్య వర్మ, దీపికలు ఒక్కటయ్యారా..??? అనేది మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :
* కథ – కథనం

మైనస్ పాయింట్స్ :
* గ్రాఫిక్స్
* పేలవ డైలాగ్స్

ఎవరెలా చేశారంటే ?
హీరోయిన్ ను వెంటాడే గతం నుండి ఆమెను బయటకు తీసుకొచ్చే హీరో ప్రయత్నమే ప్రధానంగా అంశంగా రచయిత తెరకెక్కింది. ఈ ప్రయత్నంలో ఇతర అంశాల మీదికి మళ్లీ ప్రేక్షకుడికి ప్రధాన అంశంనే మరిచిపోయేలా ఉంది. దీనితోడు రచయిత శిష్యుడు చేసే అతి, శాంతాడంత డైలాగులు విసుగుని తెపిస్తాయి. దర్శకుడిగా వందశాతం సక్సెస్ కాలేకపోయిన విద్యాసాగర్ రాజు.. నటుడుగా బాగానే చేశాడు.

హీరోయిన్‌ సంచిత పదుకొనే నటనతో ఆకట్టుకొంది. భయానికి, ప్రేమకు మధ్య నలిగిపోయే అమ్మాయి పాత్రకు తన నటనతో ప్రాణం పోసింది. 50ల కాలం నాటి అమ్మాయిగా హుందాగా కనిపించి మెప్పించింది. అదే సమయంలో గ్లామర్‌ షోతోనూ ఆకట్టుకుంది. ఆమెతో నిశ్చితార్థం జరిగిన తర్వాత చనిపోయిన పాత్రలో నటించిన శ్రీధర్ వర్మ బాగా నటించారు.

సాంకేతికంగా :
రీవేంజ్‌ డ్రామాకు 1954 నాటి నేపథ్యం తీసుకున్న దర్శకుడు కథనాన్ని ఆసక్తికరంగా నడిపించాడు. ఐతే, కథ-కథనంలో బలం లేకపోవడం సినిమా ఫలితాన్ని ప్రభావితం చేసింది. జెబి, షాన్ రెహమాన్ ల సంగీతం ఫర్వాలేదు. సినిమాటోగ్రఫీ ఎఫెక్టివ్’గా లేదు. విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్రధాన మైనస్ గా అనిపించింది. విజువల్ ఎఫెక్ట్ బాగుంటే సినిమా మరో రేంజ్ లో ఉండేది. సినిమాలో అనవసర సన్నివేశాలు చాలానే ఉన్నాయి. వీటికి కత్తెరపెడితే సినిమా మరింత షార్ప్ గా తయారవవచ్చు.

బాటమ్ లైన్ : రచయిత.. గొప్పతనం కనిపించలేదు
రేటింగ్ : 2.5/5