రివ్యూ : వినయ విధేయ రామ

చిత్రం : వినయ విధేయ రామ (2019)

నటీనటులు : రామ్ చరణ్, కైరా అద్వాని, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ స్నేహ తదితరులు

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

దర్శకత్వం : బోయపాటి శ్రీను

నిర్మాత : డివివి దానయ్య

రిలీజ్ డేట్ : 11జనవరి, 2019.

రేటింగ్ : 2.75/5

యాక్షన్ హైలైట్ గా కుటుంబ కథా చిత్రాలని తీయడం దర్శకుడు బోయపాటి ప్రత్యేకత. ఫ్యామిలీ ఎలిమెంట్స్ ని టచ్ చేస్తూనే యాక్షన్ పీక్స్ లో చూపిస్తుంటారాయన. అందుకే బోయపాటి సినిమాలు ఇటు మాస్, అటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకొంటాయి. ఇప్పుడు రామ్‌చరణ్‌ని ‘వినయ విధేయ రామ’గా చూపించారు బోయపాటి. మరి బోయపాటి మాస్‌ హీరోగా చరణ్ ఎలా కనిపించారు. సాఫ్ట్‌ టైటిల్‌తో వచ్చిన ఈ మాస్‌ సినిమా ఎలా ఉంది ? ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది ?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

కొణిదెల ఫ్యామిలీ.. ఐదుగురు అన్నదమ్ములున్న అందమైన ఫ్యామిలీ. రామ్ కొణిదెల (రామ్ చరణ్) అందరి కన్నా చిన్నోడు. చిన్నోడంటే అందరికీ ఇష్టం. కుటుంబం అంటే చిన్నోడి చాలా ఇష్టం. రామ్ పెద్దన్న భువన్ కుమార్ (ప్రశాంత్ ) విశాఖ ఎలక్షన్ కమిషనర్‌గా ప‌నిచేస్తుంటాడు. అక్క‌డ జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో పందెం పరశురాం (ముఖేష్ రుషి) అరాచ‌కాల‌ను భువన్ కుమార్ పెడ‌తాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలవుతోంది. రామ్ కుటుంబంపై పగ తీర్చుకోవడానికి పరశురామ్ బీహార్లో ఉండే మున్నాభాయ్ (వివేక్ ఒబెరాయ్)ను తీసుకొస్తాడు. అలా తన కుటుంబాన్ని టార్గెట్ చేసిన మున్నాభాయిని రామ్ ఎలా ఎదుర్కున్నాడు అనేది కథ.

ప్లస్ పాయింట్స్ :

* రామ్ చరణ్ నటన

* యాక్షన్ ఏపీసోడ్స్

* మాస్ మూమెంట్స్

నెగెటివ్ పాయింట్స్ :

* రొటీన్ కథ

* మోతాదు మించిన యాక్షన్

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

బోయపాటి చిత్రాల్లో సహజంగా యాక్షన్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో కుటుంబ బంధాలు, అనుబంధాలను చూపిస్తారు. ఈసారి కూడా అదే ఫార్ములాను ఆయన ఎంచుకున్నారు. ఫస్టాఫ్ మొత్తం కుటుంబం, హీరో హీరోయిన్ల ప్రేమ తాలూకు సన్నివేశాలతో, ఫైట్లతో సరదా సాగింది. సెకాంఢాఫ్ లో సినిమాను ఫైట్ల మధ్యలోకి లాక్కెళ్లిపోతాడు బోయపాటి. అక్కడి నుండి అన్నీ పోరాటాలు. రక్తపాతాలే. ఓ పాట.. ఓ ఫైట్ అన్నట్టుగా సాగింది. ఫస్టాఫ్ లో కనిపించిన ఫ్యామిలీ, లవ్ ట్రాక్ కనిపించవు. అంతా.. యాక్షన్.. యాక్షన్.

బోయపాటి తనదైన స్టైల్లో చరణ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేశాడు. చరణ్ సిక్స్ ప్యాక్ బాడీతో చేసిన ఫైట్స్ అభిమానులని మెప్పిస్తాయి. ఫైట్స్, డ్యాన్స్, డైలాగ్స్ లో చరణ్ ఇరగదీశాడు. ఈ రేంజ్ యాక్షన్ ని మరే దర్శకుడు చరణ్ తో చేయించలేదు.. చేయించడు కూడా. హీరోయిన్ కైరా అద్వానీ అందంగా కనిపించింది. ఆమెకి నటించే ప్రాధాన్యత దక్కలేదు. చరణ్ పెద్దన్నయ్యగా నటించిన సీనియర్ హీరో ప్రశాంత్ నటన బాగుంది. ఆర్యన్ రాజేష్, స్నేహ.. నటనతో ఆకట్టుకొన్నారు. విలన్ పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటన ఆకట్టుకొంది. మిగితా నటీనటులు ఫర్వాలేదనిపించారు.

సాంకేతికంగా :

దేవిశ్రీ ప్ర‌సాద్ పాట‌లు మాస్‌కు న‌చ్చేలా ఉన్నాయి. పాట‌ల్లో రామ్‌ చ‌ర‌ణ్ స్టెప్‌లు అభిమానుల‌ను మెప్పిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. రిషి పంజాబీల సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : టైటిల్ లోనే క్లాస్ రాముడు. తెరపై మాత్రం మాస్ రాముడే కనిపిస్తాడు. మాస్ రాముడు.. మాస్ ప్రేక్షకులని బాగా నచ్చుతాడు.

రేటింగ్ : 2.75/5